తేనె లొలికే భాష మన మాతృభాష తెలుగు. భారత దేశ భాషల్లో కెల్లా తీయనైన భాష, ప్రపంచ భాషల్లోనే ఉత్తమమైన రెండవ లిపి కలిగిన భాష.. మన తెలుగు భాష. ఇంతటి ప్రత్యేకత కలిగిన భాష నేడు అనాధరణకు గురవుతుంది. మన భాషని భావితరాల వారికి ప్రాచుర్యాన్ని పెంపొందించుట కొరకు మా స్వచ్చంధ సంస్థ 'మన తెలుగు మన వెలుగు ' ఉద్భవించింది. తెలుగు భాషని పాఠశాలల్లో విద్యార్ధులకు భోధించుట ద్వారా, తెలుగు సాహిత్యాన్ని సరళ పద్ధతుల్లో అందుబాటుకి తేవడం ద్వారా తెలుగు భాషాభివృద్ధికి మావంతు ప్రయత్నంగా సంకల్పించుకొని ఈ సంస్థను ప్రారంబించడం జరిగింది.
అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. మన యవ్వనంలో కలిసి చదువుకున్న మిత్రులతో కలిసి పనిచేయడంలొ ఉన్న ఆనందం మరేదైనా ఉంటుందా? ఈ మన తెలుగు మన వెలుగు ప్రయత్నానికి బీజము వేసింది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల నుండి బయటకు వచ్చిన 1980-84 బ్యాచ్ పూర్వ విద్యార్ధుల మిత్ర బృందం. వీరు ప్రపంచంలో ఉన్న నలు మూలల నుండి తమ వంతు ప్రయత్నంగా తెలుగు భాషాభివృద్దికి కృషి చెయ్యడానికి సంకల్పించుకొన్నారు.
ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బతుకు కష్టం. మన పిల్లలకు క్వాలిటి విద్యను ఇస్తూ, వారికి ఇష్టమైన మతృభాషలో భోధిస్తూ వారి భవిష్యత్తుకు మంచి బాటను వెయ్యడంలో తెలుగు భాషను ఉపయోగించాలనేది మా ప్రయత్నం. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలోఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు ఒక పాఠ్యాంశం గా ఉండేట్లు కృషి చెయ్యడం జరుగుతుంది. మరియు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం లో భోధించుటకు అవసరమైన ప్రోత్సాహన్ని అందిస్తాము. విధ్యార్థుల సౌలభ్యం కోసం పాఠశాల పుస్తకాలు మా సంస్థ అంతర్జాలంలో పొందు పర్చడానికి ప్రయత్నిస్తాము.
ఎందరో మహానుభావులు, అందరికి వందనములు. తెలుగు భాష తీపిని సాహిత్యం ద్వారా రుచి చూపించిన మహనీయులందరికి ధన్యవాధములు. మన తెలుగు భాషాభివృద్ధికి దోహదపడే సాహిత్యాన్ని (గ్రంధములు, కథలు, కవితలు) సాహిత్యప్రియులకు దగ్గర చేర్చడానికి ఒక్క స్థానంలో ఉంచి సులభంగా లభ్యమవ్వడానికి దోహద పడతాం. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఇంకా ఎక్కువగా చదవడానికి వీలవుతుంది.
#దృక్పథం : తరతరాలవరకు తెలుగును వృద్ధిపరచి పోషించి ఆశ్వాదించుట
విద్య, సామాజిక, మరియు సాహిత్య రంగాల్లోని వివిధ వేదికలలో తెలుగుభాష ఉపయోగాన్ని మరింత పటిష్టపరచి దానికి అవసరమైన, మెరుగైన సమీకరణాలను వృద్ధి పరచుట
1) తెలుగు రాష్ట్రాలలోని విద్యాసంస్థలలో తెలుగు భాష అభివృద్ధికి కృషి.
2) ఉభయ తెలుగు రాష్ట్రాలలో విద్యా బోధనలో తెలుగు తప్పనిసరి ఉండాలని కోరుతూ అన్ని స్థాయిలలో తెలుగు ఒక సబ్జెక్టు గా ఉండేటట్లు కోరటం.
3) తెలుగుకు అన్ని స్థాయిలలో అవసరమైన ప్రోత్సాహకం అందించడం.
4) తెలుగు బోధనకు సహాయపడే వివిధ సమీకరణాలను సమకూర్చుకొనుట
5)తెలుగు భాష ప్రాచుర్యానికి కృషి చేస్తున్న వివిధ సంస్థలతో చేయి కలిపి సహకరించుట.
6). తెలుగు భాషోద్ధరణకై కృషి చేస్తున్న వారిని గుర్తించి వారిని సత్కరించి ప్రోత్సహించుట