తెలుగుజాతి మర్చిపోలేని గొప్ప న్యాయకోవిదుడు
జస్టిస్ కోకా సుబ్బారావు.
ఆంధ్ర రాష్ట్ర తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(1954)
ఆంధ్రప్రదేశ్ తొలి ప్రధాన న్యాయమూర్తి (1956)
సుప్రీంకోర్టు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తి
(1966 జూన్ 30)
తెలుగు జాతి నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తొలి ఆంధ్రుడు
పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల సవరణకు ఏ చట్ట సభలకు సాధ్యం కాదని చివరకు పార్లమెంటుకు కూడా ఆ అధికారం లేదని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
ఇన్ని ప్రత్యేకతలు కలిగిన వ్యక్తి
తెలుగు జాతి గర్వించదగ్గ న్యాయమూర్తి
జస్టిస్ కోకా సుబ్బారావు.
ఈయన గోదావరి ఒడ్డున, రాజమండ్రిలో 1902 జూలై 15న విద్యావంతులైన కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి సుబ్రమణ్యేశ్వర నాయుడు రాజమండ్రిలో ప్రముఖ న్యాయవాది. తండ్రి సుబ్బారావు చిన్నతనంలోనే మరణించాడు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పొందిన తరువాత, మద్రాసు లా కాలేజీలో న్యాయశాస్త్రం చదివాడు. ఆయన మంచి క్రీడాకారుడు కూడా.
సుబ్బారావు, మామయ్య పి. వెంకట రమణారావు నాయుడు వద్ద పని ప్రారభించాడు. వెంకట రమణారావు నాయుడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులుకు జూనియరుగా ఉండేవాడు.
తన బావమరిది పి.వి రాజమన్నార్ తో కలసి నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ముఖ్యమైన కేసులన్నింటినీ వాదించారు.
1954 లో గుంటూరు లో ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు పర్యవేక్షణకు టంగుటూరి ప్రకాశం పంతులు సుబ్బారావు గారిని ఏరికోరి
ప్రత్యేక అధికారిగా నియమించుకున్నాడు.
తర్వాత ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా నియమించబడ్డాడు.
1954లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు సుబ్బారావు విశ్వవిద్యాలయపు తొలి సంచాలకునిగా నియమించబడ్డాడు. విశ్వవిద్యాలయల చట్టాన్ని సవరించి రాష్ట్ర గవర్నరుకు విశ్వవిద్యాలయాల సంచాలక పదవిని గవర్నర్ చేపట్టే వరకు సుబ్బారావు ఆ పదవిలో కొనసాగాడు.
తర్వాత ఆయన 1958 జనవరి 31న సుప్రీంకోర్టు జడ్జిగానూ,.
1966 జూన్ 30న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గానూ నియమించబడ్డాడు.
జస్టిస్ కోకా సుబ్బారావు న్యాయసంబంధ విషయాలపై అనేక రచనలు చేశాడు. ఆయన రచనలలో ముఖ్యమైనవి.
1)Social Jesuits and law.
2)constitution development of India.
3)Fundamental Rights under The constitution of India.
4)The Indian federal system.
5)complexity in Indian politics.
జస్టిస్ కోకా సుబ్బారావు గారు రాజకీయ ఆరంగ్రేటం కూడా చేశారు
నాలుగవ రాష్ట్రపతి ఎన్నికలలో, ప్రతిపక్ష పార్టీల యొక్క ఏకగ్రీవ అభ్యర్థిగా పోటీచేయటానికి 1967 ఏప్రిల్ 11న న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు.
అయితే ఈ ఎన్నికలలో కాంగ్రేసు అభ్యర్థి అయిన జాకీర్ హుస్సేన్ చేతిలో పరాజితుడయ్యాడు.
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా తన అచంచలమైన విశ్వాసంతో ప్రతిభాపాఠవాలతో తెలుగుజాతి గర్వించదగ్గ స్థాయికి చేరారు సుబ్బారావు గారు .
భారత న్యాయ శాస్త్ర చరిత్రలో కోకా సుబ్బారావు గారి అధ్యాయం మరువలేనిది .
తాను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా రాజ్యాంగబద్ధంగా, ధైర్యంగా, తీర్పు ఇచ్చిన వ్యక్తి
కోకాసుబ్బారావు గారు .
అందుకే ఈ జాతి తెలుగు వెలుగుల్లో ఆయన స్థానం చిరస్మరణీయం
జస్టిస్ కోకా సుబ్బారావు మే 6, 1976న బెంగుళూరులో మరణించాడు.
బెంగుళూరు విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.