పావులూరి మల్లన (గణిత మేధావి)
5-11వ శతాబ్దాల మధ్య పాణిని, పింగళుడు, వరాహమిహిడు ,ఆర్యభట్టు, బ్రహ్మగుప్తుడు,
మొదటి భాస్కరుడు, శ్రీధరుడు ,మహావీరాచార్య,
ఆచార్య హేమచంద్రుడు, భాస్కరాచార్యుడు,
వంటి గణిత మేధావులు ఉన్నారు. అటువంటివారి కోవలో తెలుగు జాతి వాడైన "పావులూరి మల్లన" ఒకరు.
ఈయన గురించి ఖచ్చితమైన ఆధారాలు సంపూర్తిగా లభించక పోయినప్పటికీ ఈయన తెలుగునేలలో గోదావరి జిల్లాల వాసి అనే విషయాన్ని ఆయన రచనల ద్వారా పరిశోధకులు నిర్ధారించారు.
ముఖ్యంగా ఆయన కాలం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పావులూరి మల్లన, నన్నయ కాలం వాడని కాదు నన్నెచోడుని కాలం వాడని భిన్న వాదాలున్నాయి.
కానీ ఈయన రచనలు అందులో ప్రయోగించిన భాషను బట్టి ఆయన 11వ శతాబ్దానికి కాస్త అటూ ఇటూ వాడని తెలుస్తుంది కానీ రాజరాజనరేంద్రుడు నుండి "నవఖండవాడ" అని అగ్రహారాన్ని పొందినట్టు ఆధారాలు ఉన్నాయి. అందువల్ల ఈయన 11 వ శతాబ్దానికి చెందినవాడుగానే భావించవచ్చు.
గోదావరి ప్రాంతంలోని పావులూరు గ్రామానికి ఆయన కరణంగా పని చేశాడని చెప్తారు.
ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలలో పావులూరు అనే గ్రామం కనిపించదు. పారుపాక, పాలచర్ల ,పామర్రు, పాములేరు, వంటి గ్రామాలు గోదావరి జిల్లాలో ఉన్నాయి
కానీ పావులూరు లేదు. బహుశా పావులూరు అన్నది మరొక గ్రామం గా రూపాంతరం చెంది ఉండవచ్చు.
లేదా కనుమరుగై ఉండచ్చు.
గౌరమ్మ ,శివన్నలు ఈయన తల్లిదండ్రులు. సంస్కృతంలో మహావీరాచార్యులు రాసిన "జైన గురుసార సంగ్రహగణితము" ను లీలావతి గణితము గా తెలుగులోనికి అనువదించాడు.
దీని మూలగ్రంథం సంస్కృతం అయినప్పటికీ మల్లన లీలావతి గణితములో రాసినవన్నీ స్వయంగా వేసుకున్న లెక్కలన్నది విమర్శకుల అభిప్రాయం. ఈయన రచనల్లో ఎక్కడా పెట్టి పదాలు ఉండకపోవడం విశేషం ఇంపైన తెలుగు పదాలతో రచన సాగించడం ఆయన ప్రతిభకు తార్కాణం ఈయన తన రచనల్లో కవి స్తుతి కవి పరిచయం చేయడానికి అతీతుడు.
తన రచనలతో తర్కం ,వ్యాకరణం ,ఖగోళ ,భూగోళ విషయాలలో ప్రజలకు ఆసక్తిని కలిగించే వాడని తెలుస్తుంది.
ఏదిఏమైనప్పటికీ 11 వ శతాబ్ద కాలంలో గణితశాస్త్రం పైన గ్రంధాన్ని రాసిన ప్రాచీన కవిగా పావులూరి మల్లనను ఈ తరం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది.