Personality In Detail!ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్.

ఆచార్య దేవోభవ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్.
కోట్లమందికి ఆరాధ్యుడు, ఆదర్శ పాత్రుడు,
తొట్టతొలి "భారతరత్న" సర్వేపల్లి రాధాకృష్ణన్.

ఆయన జీవితమే ఓ మార్గదర్శకత్వం
స్ఫూర్తి ప్రదాతగా,
విద్యావేత్తగా ఎవరెస్టంత ఎత్తు ఎదిగి అనంతరం రాజ్యాంగ పదవులు చేపట్టి వాటికి విలువల సౌధాలు నిర్మించిన మంచి మాస్టారు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ .
ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చి తన పేరు చెబితే విద్యావ్యవస్థలే చేతులెత్తి నమస్కరించే ఉన్నతమైన సంస్కారాన్ని రూపొందించిన గురువు ఆయన.
1888 లో జన్మించిన ఆయన జన్మదినమే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకునే జీవితం జీవించా రాయన. ఆయన పుట్టిన తేదీని దేశంలో ఎవరికీ చెప్పనక్కర్లేదు. అక్షరం దిద్దిన ప్రతి ఒక్కరి మదిలో ఆయన జన్మదినం పదిలం. అది ఆయన జీవితం.
ఆయన భారత తాత్వికచింతన ప్రతినిధి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్ట గలిగారాయన.
భారతదేశంలో అత్యున్నత పదవులు చేపట్టారు. అత్యున్నత పురస్కారాన్ని పొందారు.
                      కానీ
ఆయన ఓ ఆదర్శ ఉపాధ్యాయుడిగా మాత్రమే భారతీయుల గుండెల్లో కొలువయ్యారు.

ఈయన తమిళనాడు ప్రాంతంలోని తిరుత్తణిలో 1888లో జన్మించినప్పటికీ ఆయనను కన్న పుణ్యదంపతులు సీతమ్మ ,వీరాస్వామి మాత్రం తెలుగు ప్రాంతం నుండి వలస వెళ్లిన వారే కావడం విశేషం.
ఆయన ప్రాధమిక విద్యాభ్యాసమంతా తెలుగు ప్రాంతం లోనే సాగింది.
తిరుపతి, నెల్లూరు లలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని
మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో ఎం.ఏ పూర్తి చేశారు.
21 సంవత్సరాల చిన్న వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్య పదవిని చేపట్టి ఆయనకు అంతకు మునుపే శివకామమ్మతో వివాహమైంది.
ఆయన విజ్ఞాన నిధి.అందువల్లనే
మైసూరు విశ్వవిద్యాలయం
కలకత్తా విశ్వవిద్యాలయాలలో ఆచార్య పదవి చేపట్టారు.
కలకత్తా విశ్వవిద్యాలయం లో ఆచార్య పదవి చేపట్టడానికి అక్కడి ప్రాంత ప్రజలు అభ్యంతరం చెప్పారు.
అందుకు ఆయన తన అసమాన ప్రతిభా పాటవాలతో బెంగాలీ ప్రజలను మెప్పించి ఆ పదవిని చేపట్టారు.

కలకత్తా యూనివర్సిటీ తరపున కేంబ్రిడ్జ్‌(ఇంగ్లండ్‌)లో జరిగిన ఒక సమావేశానికి వెళ్లారు. ఆ సమావేశంలో ఆయన కనబరిచిన ప్రతిభకు ఆంగ్లేయులు అబ్బురపడ్డారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో దాదాపు 30 సంవత్సరాల పాటు ఆయన ప్రొఫెసర్‌గా వాళ్లకు పాఠాలు బోధించారు. ఇందుకోసం ఏడాదిలో ఆర్నెల్లపాటు అక్కడే ఉండేవారు.
ఈయన కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉండగనే "భారతీయ తత్వశాస్త్రము" అనే 1300 పుటల గ్రంథ రచన చేపట్టి ప్రపంచ మేధావుల ప్రశంసలు అందుకున్నారు.
ఈ భారతీయ ఆరాధ్య గురువు రాధాకృష్ణన్ గారు
చేపట్టి గౌరవాన్ని తెచ్చిన వివిధ పదవులు.
1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి
1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసారు.
బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆయన ఉపకులపతిగా ఉండగా ఆంగ్లేయులు అభ్యంతరం చెప్పినప్పటికీ మహాత్మాగాంధీని సత్కరించారు ఆయన.
1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా 1947 ఆగస్టు 14-15తేదీన అర్ధరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం దేశ ప్రజలను నాయకులను ఉత్తేజపరిచింది.
1949లో భారతదేశంలో విద్యా సంస్కరణలు చేపట్టిన కమిటీకి ఈయనే తొలి అధ్యక్షులు .

1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసారు.
1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.
1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు.
1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు.

తొలి ఉపరాష్ట్రపతి:
26 జనవరి 1952 నుండి 12 మే 1962 వరకు.
రెండు పర్యాయాలు.

రెండవ రాష్ట్రపతి:
14 - మే - 1962 నుండి   13 - మే 1967 వరకు.
ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులు ఆయన కోరుకున్నవి కావు ఆ నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కోరికమేరకు ఆ పదవులను చేపట్టారాయన.

పొందిన గౌరవములు.
1931లో బ్రిటీషు ప్రభుత్వంచే ప్రతిష్ఠాత్మక "సర్" బిరుదును పొందారు.
1954లో తొలి భారతరత్న పురస్కారం ఆయనను వరించడం వల్ల గౌరవించబడింది.
ఆయన పుట్టిన రోజు సెప్టెంబర్ 5 ను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆయనకు దక్కిన గొప్ప గౌరవం.
తెలుగు జాతి వారసుడిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఈ దేశం ఎప్పటికీ మరువదు.
రాష్ట్రపతి పదవి విరమణ తరువాత ఎనిమిదేళ్లు మద్రాసులోని తన స్వగృహంలోనే ఉన్నారు. 1975 ఏప్రిల్‌17న కన్నుమూశారు.
ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి కేవలం తన ప్రతిభ వల్ల అత్యున్నత స్థాయికి ఎదగటమే కాకుండా సమకాలీన మేధావులలో ఒకరుగా ప్రపంచమంతటా గుర్తింపబడిన తత్వశాస్త్రజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌

situs slot gacorslot88