డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ.
1992 ఫిబ్రవరి 1 న రామలక్ష్మణులు అనే అవిభక్త కవలను శస్త్రచికిత్స ద్వారా వేరుచేసి
భారతీయ వైద్య రంగాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ప్రపంచ వైద్య చరిత్రలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన తెలుగు వైద్యులు యార్లగడ్డ నాయుడమ్మ.
ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నాయుడమ్మ బ్రతుకు తెరువు కోసం కాకుండా నిరుపేదలకు సేవచేయడానికే వైద్యరంగంలోకి కాలుమోపాడు.
భారతదేశంలో ఈనాటికి చిన్న పిల్లలకు సంబంధించిన అరుదైన శస్త్ర చికిత్సలు చేసే ఏకైక వైద్యులు యార్లగడ్డ నాయుడమ్మ.
అంతవరకూ ఉన్నత చదువులు చదువుకోని కారంచేడు గ్రామం నుండి ఖండాంతరాలకు తన కీర్తిని వ్యాపింప చేసిన ఘనత ఆయనదే.
ప్రకాశం జిల్లా కారంచేడు లో
యార్లగడ్డ సుబ్బారావు, రంగమ్మ దంపతులకు 1947 జూన్ 1న జన్మించాడాయన. 1970లో గుంటూరు వైద్య కళాశాల నుండి వైద్యశాస్త్రములో పట్టా పొందాడు.
1974 లో రోహతక్ వైద్య కళాశాల నుండి శస్త్రచికిత్సా శాస్త్రములో యం.యస్ పట్టా పొందాడు. అనంతరం 1975లో ఢిల్లీ లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (AIMS) నుండి బాల్యశస్త్రచికిత్సలో యం.సి.హెచ్ పట్టభద్రుడయ్యాడు.
వృత్తి నైపుణ్యంతో పాటు పనిపట్ల అంకితభావమే ఆయనను తెలుగు వైద్య జాతిలో ఆణిముత్యంగా చేసింది.
1992లో రామలక్ష్మణులు వేరు చేయడమే కాక
1993లో చాతి ఉదర భాగం కలసి పుట్టిన
అంజలి గీతాంజలిలను వేరు చేశారు.
2002లో పొత్తి కడుపు కలయికతో పుట్టిన
రేఖ సురేఖను వేరు చేశారు.
ఈ విధంగా అవిభక్త కవలలను వేరు చేయడంలో డాక్టర్ నాయుడమ్మ గారు దేవుడమ్మ అయ్యారు.
వైద్య వృత్తి తో పాటు ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు అందిస్తున్నారు.
ఆయన కృషికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు ఆయన్ను వరించాయి.
అందులో ప్రధానంగా
2004లో రామినేని ఈ పురస్కారం అందుకున్నారు.
2008లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్ తో సత్కరించబడ్డారు.
2016లో ఆయనకు దక్కిన పద్మశ్రీ పురస్కారం తెలుగు వైద్యరంగానికి దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు.
తెలుగు వైద్య జాతి కీర్తికిరీటంలో నాయుడమ్మ స్థానం ఆదర్శవంతమైనది.