.
తెలుగు చరిత్రను
తెలుగు సాహితీ మూర్తులను
తెలుగు నేలను పులకరింప చేస్తున్న ప్రతి నీటి చినుకును తన అక్షరాలతో తడిమిన మహనీయుడు ఆయన.
ఈ జాతికి ఒక తెలుగుతల్లంటూ ఒకరున్నారని గుర్తు చేసిన మహా మనిషి ఆయన.
కులాలు
మతాలు
జాతులు
ప్రాంతాలు వేరైనయినప్పటికీ తెలుగు జాతి అందరినీ తెలుగు తల్లి బిడ్డల గా చేసిన పుణ్య పురుషుడు శంకరంబాడి సుందరాచారి గారు.
ఇదిగో ఆయన రాసిన పాట
మా తెనుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ ॥మా తెనుగు॥
కడుపులో బంగారు కను చూపులో కరుణా
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి ॥మా తెనుగు॥
గల గలా గోదారి కదలి పోతుంటేను ॥గల గలా॥
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి ॥మా తెనుగు॥
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ పాటలే పాడుతాం
నీ ఆటలే ఆడుతాం
జై తెనుగు తల్లీ! జై తెనుగు తల్లీ!!
ఆయన గురించి సంక్షిప్త పరిచయం:
1914 ఆగష్టు 10 వ తారీఖున తిరుపతి లో జన్మించిన సుందరాచారి గారు 62 సంవత్సరాల వయసులో1977 ఏప్రిల్ 8వ తారీఖున తిరుపతిలోనే పరమపదించారు.
సుందరాచారి గారి జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం.
మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. తండ్రి మందలింపుతో ఇంటి నుంచి బయటకు వచ్చిన సుందరాచారి అనేక కష్టాల నుంచి తన జీవితాన్ని నెట్టుకొచ్చారు .
రైల్వే స్టేషనులో కూలీగా పని చేశారు.
మద్రాసు చేరి పత్రికలలో అక్షరదోషాలు దిద్దే పనిలో చేరారు.
సినిమా రంగంలో పనిచేశారు.
మహాత్మాగాంధీ,
బిల్హణీయం,
దీనబంధు అనే సినిమాలకు పాటలు వ్రాసాడు.
ఎక్కడ తన స్వతంత్ర భావాలు నుంచి ఆయన పక్కకు రాలేదు.
ఆయన మద్రాసులో ఉండగా ప్రముఖ వ్యక్తి పైన పద్యం రాయమని చెబితే అందుకని ససేమిరా ఒప్పుకోలేదు.
తాను ఒక పాఠశాలలో పర్యవేక్షకుడిగా పని చేస్తూ ఉండగా పాఠశాల సంచాలకులు ఆ పాఠశాలకు వచ్చినప్పుడు సుందరాచారిని
గుర్తుపట్టలేక అవమానించాడు .
దానితో బాధ పడి పని నుంచి మానుకున్నాడు. సుందరాచారి నిబద్ధత గల వ్యక్తి తన మనస్సాక్షికి వ్యతిరేకంగా దీనిని చేసే వాడ కాదు అందువలన ఆయన అనేక కష్టాలకు ఓర్చుకుంటే చివరకు తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య
వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు.
రచనలు:
సుందర రామాయణం
సుందర భారతం
శ్రీనివాస శతకం
జపమాల తో పాటు
బుద్ధగీతి అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసాడు.
రవీంద్రుని గీతాంజలిని అనువదించాడు.
ఏకలవ్యుడు అనే ఖండకావ్యం,
కెరటాలు అనే గ్రంథం కూడా రచించాడు.
సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసాడు. జానపద గీతాలు వ్రాసాడు, స్థల పురాణ రచనలు చేసాడు. ఇవే కాక అపవాదు, పేదకవి, నాస్వామి, నేటికవిత్వము, బలిదానము, కార్వేటి నగరరాజ నీరాజనము మొదలైనవి వీరి ఇతర రచనలు.
తెలుగు జాతి సగర్వంగా చెప్పుకునే పాట "మా తెనుగు తల్లికి మల్లెపూదండ "ఈ పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించడం అది తెలుగు విద్యార్థులు అందరికీ అందించడం ఆయనకు దక్కిన గౌరవమే.
తెలుగు జాతి కి దక్కిన వెలుగులలో శంకరంబాడి సుందరాచారి గారు ఒకరనడం ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి మహనీయుల జీవితాలు గురించి రేపటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది